రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
వాణిజ్య నౌకలకు హెచ్చరిక
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలం అవ్వటంతో.. హోర్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజుల నుంచి వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే సైప్రస్ జెండా ఉన్న వాణిజ్య నౌకపై ఐఆర్‌జీసీ దాడి చేసింది. దీంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, కేష్మ్ ద్వీపాలలో వైమానిక దాడులు చేసింది.
అమెరికా దాడుల నేపథ్యంలో ఐఆర్‌జీసీ కీలక ప్రకటన చేసింది. అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, నౌకలపై దాడులు చేయబోమని హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసింది.
దాడి.. తమ తప్పిదమేనని ఇరాన్ నాయకులు అంగీకరించారా..
అమెరికా మీడియా కథనాల ప్రకారం, వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు తమ తప్పిదమే అని ఇరాన్ నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారులకు ఇరాన్ ప్రతినిధులు రహస్యంగా సందేశం పంపారని తెలుస్తోంది. ఈ దాడులకు తమ అత్యున్నత నాయకత్వం ఆదేశాలు ఇవ్వలేదని, చర్చలను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఓ అతివాద వర్గం చేసిన దుందుడుకు చర్యల వల్ల ఈ ఘటన జరిగిందని ఇరాన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఒమాన్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలకు ముందు ఇరాన్ ఈ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వివరణను అమెరికా పూర్తిగా అంగీకరించిందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా, ఇరాన్ ఇప్పటికీ దౌత్య చర్చలను కొనసాగించాలని కోరుకుంటోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.







