భారత్‌తో కొత్త అధ్యాయానికి నేపాల్ సిద్ధం:

మనస్ఫూర్తి సంభాషణతో ఏ సమస్యా పెద్దది కాదు

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు నేపాల్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు ఓపెన్‌గా, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య ఏదీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌తో నేపాల్‌కు ఎలాంటి పాత విభేదాల భారమూ లేదని, కొత్త దృక్పథంతో ముందుకు సాగాలని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని స్పష్టం చేశారు.

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో న్యూఢిల్లీ‌లో జరిగిన భేటీ అనంతరం శిశిర్ ఖనాల్ మీడియాతో మాట్లాడారు. భారత్–నేపాల్ మధ్య కొనసాగుతున్న వివిధ అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన వివరించారు.

వాణిజ్యం, ఇంధన రంగం, జలవనరులు, డిజిటల్ కనెక్టివిటీ, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై రెండు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. నేపాల్ ఆర్థికాభివృద్ధికి భారత్ అనుభవం, మార్కెట్ పరిమాణం, పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి. కైలాస్-మానసరోవర్ యాత్ర భిన్నమైన సరిహద్దు పాయింట్ల ద్వారా జరుగుతుంది. చాలా మంది నేపాల్ గుండా కూడా ప్రయాణిస్తారు. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతం ద్వారా భారత్, చైనాల మధ్య ఒప్పందాన్ని పునరుద్ధరించడంపైనే మేం ఆందోళన చెందుతున్నాం

కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాల విషయంలో నేపాల్ ఆందోళనలను ఖనాల్ మరోసారి స్పష్టం చేశారు. ఆ ప్రాంత భూభాగంపై తమ దేశ హక్కును నేపాల్ ప్రభుత్వం పునరుద్ఘాటిస్తున్నదని ఆయన చెప్పారు.

కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతంలోని భూమి నేపాల్‌కు చెందినది. నేపాల్ సమ్మతి లేకుండా ఇరు దేశాలు ఆ ఒప్పందాలను చేసుకోలేవు. ఆ విషయాన్ని భారత విదేశంగా శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ప్రపంచవేదికగా వేగంగా ఎదుగుతున్న భారత్‌తో కలిసి పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం

భారత్‌తో సంబంధాలపై నేపాల్‌కు ఎలాంటి పాత విభేదాల భారమూ లేదని, భవిష్యత్‌ దృష్టితో ముందుకు సాగాలని కోరుకుంటున్నామని ఖనాల్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడేలా కృషి చేయాలని నేపాల్ ఆశిస్తున్నదని ఆయన తెలిపారు. భారత్‌ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, ఆ దేశంతో భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవడం నేపాల్‌కు ప్రయోజనకరమని ఖనాల్ అభిప్రాయపడ్డారు. ఇంధన, జలవనరులు, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారం పెంచుకోవడం ద్వారా ఇరు దేశాలకూ లాభం చేకూరుతుందని ఆయన భావిస్తున్నారు. భారత్–నేపాల్ సంబంధాలు చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక బంధాలతో ముడిపడి ఉన్నాయని, ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖనాల్ స్పష్టం చేశారు.