రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ట్రాంప్ మద్దతు లేకున్నా ఇరాన్‌పై దాడులు చేస్తాం
సంకేతాలిచ్చిన నెతన్యాహు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశలోకి వెళ్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు ఈ భయాలను మరింతగా పెంచుతున్నాయి. ఇకపై అమెరికా మద్దతు ఉన్నా, లేకపోయినా ఇరాన్‌పై సైనిక చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలు ఇజ్రాయెల్ నుంచి వెలువడుతున్నాయని అక్కడి మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభంపై ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
“అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి”
అని ఆయన కేబినెట్ సభ్యులకు స్పష్టం చేసినట్లు అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి. అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని, అయితే అవసరమైతే వెనుకడుగు వేయబోమని నెతన్యాహు అభిప్రాయపడ్డారని సమాచారం.
ఇదే సమావేశంలో అమెరికా–ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఏ ఇరాన్ ఒప్పందం కూడా ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావం నేపథ్యంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు గత కొంతకాలంగా అమెరికా–ఇజ్రాయెల్ మిత్రబంధంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం దిశగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, మరోవైపు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఈ దాడులు ఆగకపోవడం వల్ల ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని, లెబనాన్‌పై సైనిక చర్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నెతన్యాహును హెచ్చరిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే నెతన్యాహు మాత్రం పరిమిత దాడులను కొనసాగించేందుకు సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. జాస్క్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్టు అక్కడి నివేదికలు పేర్కొన్నాయి.
ఇరాన్ దాడికి ప్రతీకారంగానే, ఆత్మరక్షణ చర్యల భాగంగా ఈ వైమానిక దాడులు పూర్తయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నుంచి వచ్చే ఏ ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
అమెరికా దాడులకు ఇరాన్ కూడా వెంటనే ప్రతిస్పందించింది. తమపై జరిగే ప్రతి దాడికి సమాధానం ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ముందుగానే హెచ్చరించగా, ఆ తర్వాత కొద్దిసేపటికే అమెరికా స్థావరాలు, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఐదో నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎదురుదాడులు ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. బహ్రెయిన్ ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం అక్కడ పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
అమెరికా సైనిక దూకుడు కొనసాగితే మరింత తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. ఇదే సమయంలో, మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నట్టు అమెరికా ముందుగానే ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో తాజా దాడులు ఆ ముందస్తు సమాచారానికి అనుగుణంగానే జరిగాయా, లేక అమెరికా ఇరాన్‌పై కొత్త దాడుల వ్యూహం సిద్ధం చేస్తోందా అన్న అనుమానాలు, ఉత్కంఠ ప్రాంత దేశాలన్నింటిలోనూ నెలకొన్నాయి.







