ఇంటర్వ్యూ అర్ధంతేరంగా నిలిపేసి వెళ్లిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా ప్రశ్నల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్‌ చివరికి మైక్‌ తీసి కిందపడేసి, ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

అమెరికా టెలివిజన్‌ కార్యక్రమం కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా ఇరాన్‌ యుద్ధం, ఆ దేశంతో జరుగుతున్న చర్చలపై ట్రంప్‌ను హోస్ట్‌ క్రిస్టెన్ వెల్కర్ ప్రశ్నించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు ఏ దశలో ఉన్నాయో వివరించాలని ఆమె కోరారు. అలాగే గత ప్రభుత్వం అన్యాయంగా పలువురిని లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ, వారికి పరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిపాదించిన యాంటీ - వెపనైజేషన్ స్కీమ్‌ గురించి కూడా ప్రశ్నలు అడిగారు.

ఈ చర్చ సందర్భంగా ట్రంప్‌ మాజీ అధ్యక్షుడు జోబైడెన్ , అమెరికా మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని, ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అకస్మాత్తుగా ఇక చాలు, ఆపేద్దాం..

దీనికి ప్రతిగా క్రిస్టెన్ వెల్కర్, పోస్టల్‌ బ్యాలెట్‌ కారణంగా ఫలితాల ప్రకటన ఆలస్యమవుతుండొచ్చని సూచించారు. అయితే ఆ వాదనను ట్రంప్‌ ఖండించారు. తన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు చూపించాలని హోస్ట్‌ పదేపదే అడుగుతుండటంతో చర్చ వేడెక్కింది. ఇంటర్వ్యూలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతుండగా ట్రంప్‌ సహనం కోల్పోయారు. అకస్మాత్తుగా ఇక చాలు, ఆపేద్దాం. థ్యాంక్యూ అని చెప్పి తన ముందు ఉన్న మైక్రోఫోన్‌ను తీసేసి కిందపడేశారు. ఇంటర్వ్యూను కొనసాగిద్దామని క్రిస్టెన్ వెల్కర్ కోరినా, ఇప్పటికే చాలాసేపు సమయం ఇచ్చానని ట్రంప్‌ పేర్కొంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ట్రంప్‌ ఇంటర్వ్యూలలో ఇలాంటి సంఘటనలు కొత్తకాదు. మీడియా ప్రశ్నల తీరుపై ఆయనకు తరచూ అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఈసారి జాతీయ టెలివిజన్‌ కార్యక్రమం మధ్యలోనే మైక్‌ తీసి కిందపడేసి వెళ్లిపోవడం అమెరికా రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.