రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఇంధన వసతులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో రష్యాలోని సమర రీజియన్‌లో ఉన్న సిజ్రాన్‌ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకుంది. కీవ్‌ దళాలు వినియోగించిన డ్రోన్లు జులై 11–12 తేదీల మధ్య ఈ రిఫైనరీపై మెరుపు దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు.

ఈ దాడుల వల్ల రిఫైనరీకి భారీ నష్టం వాటిల్లిందని, కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. సిజ్రాన్‌ రిఫైనరీ సంవత్సరానికి సుమారు 8.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల క్రూడ్‌ ఆయిల్‌ను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ శుద్ధి చేసే పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ ఫ్యూయల్‌ సమర రీజియన్‌ అవసరాలకు సరఫరా అవుతాయి. ఈ ఇంధనాన్ని రష్యా సైనిక దళాలు కూడా వినియోగిస్తున్నాయి. ఈ కర్మాగారాన్ని రోస్‌నెఫ్ట్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది.

సిజ్రాన్‌ రిఫైనరీపై ఇది మొదటి దాడి కాదు. గతంలో ఏప్రిల్‌ 18, మే 11 తేదీల్లో కూడా ఉక్రెయిన్‌ ఈ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుంది. తాజా దాడులతో కలిపి ఈ రిఫైనరీపై వరుసగా మూడు సార్లు దాడులు జరిగినట్లు స్థానిక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

ఇంధన వసతులపై దాడులను ఉక్రెయిన్‌ మరింత విస్తరించింది. అజోవ్‌ సముద్రంలో రష్యా చమురును అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకొని రవాణా చేస్తున్న 10 ట్యాంకర్లు, నాలుగు ఫెర్రీలను ఉక్రెయిన్‌ దళాలు ధ్వంసం చేశాయి. ధ్వంసమైన ఫెర్రీలు రష్యా సేనలకు లాజిస్టిక్స్‌ అవసరాలు, కార్గో తరలింపుల కోసం వినియోగిస్తున్నవిగా అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.

జులై 11న టోక్‌మాక్‌ ప్రాంతంలో భారీగా లూబ్రికెంట్‌ ఆయిల్‌ తరలిస్తున్న ఓ రైలును కూడా ఉక్రెయిన్‌ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో రైలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు, అదే సమయంలో పెద్ద ఎత్తున చమురు ట్యాంకర్లపై కూడా దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ రక్షణ దళాలు ప్రకటించాయి.

ఉక్రెయిన్‌ దాడుల ప్రభావంతో రష్యా చమురు శుద్ధి సామర్థ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, రష్యా రిఫైనరీలపై జరిగిన వరుస దాడుల కారణంగా ఆ దేశ చమురు శుద్ధి సామర్థ్యం 20% నుంచి 40% వరకు పడిపోయింది. దీనివల్ల అక్కడి ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగి, చమురు సంక్షోభం ప్రభావం కోట్లాది జనాభాపై పడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి ఇంధన మౌలిక వసతులు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటూ ఉక్రెయిన్‌ దాడులు కొనసాగుతుండటంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.