రష్యా చమురు ఎగుమతులకు కీలకమైన బాల్టిక్‌ సముద్రంలోని వైసోట్స్క్‌, ఉస్ట్‌-లుగా ఓడరేవులపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు జరిపింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మారాయని రష్యా అధికారులు తెలిపారు. భారత్‌కు చమురు ఎగుమతి చేసే ప్రధాన కేంద్రాలైన ఈ పోర్టులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వారు పేర్కొన్నారు.

రష్యా రక్షణ వ్యవస్థలు 70కి పైగా డ్రోన్లను కూల్చివేశాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే డ్రోన్ల శకలాలు, దాడుల ప్రభావం కారణంగా చమురు శుద్ధి కర్మాగారాలు, నిల్వ కేంద్రాలు నష్టపోయినట్టు సమాచారం. ఇంధనం నింపే కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర ట్యాంకర్లు నిలిచిపోయి, సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్లు రష్యా వైపు నుంచి తెలియజేశారు.

ఉస్ట్‌-లుగా రష్యాలోని అతిపెద్ద ఓడరేవులలో ఒకటి. మాస్కో ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్‌ గతంలోనూ పలుమార్లు ఈ పోర్టును లక్ష్యంగా చేసుకుంది. వైసోట్స్క్‌ కూడా బాల్టిక్‌ సముద్ర తీరంలో ఉన్న ముఖ్యమైన ఇంధన ఎగుమతి కేంద్రం. ఈ రెండు పోర్టుల నుంచే రష్యా నుంచి భారత్‌కు పెద్ద మొత్తంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి.

చమురు రంగ నిపుణుల ప్రకారం రష్యా నుంచి భారత్‌కు ఎగుమతయ్యే మొత్తం చమురులో 60-70 శాతం బాల్టిక్‌ సముద్ర మార్గం ద్వారానే వస్తోంది. ముఖ్యంగా ఉస్ట్‌-లుగా, ప్రిమోర్స్క్‌ ఓడరేవుల నుంచి చమురు నౌకలు బయలుదేరి ఉత్తర సముద్రం, సూయజ్‌ కాలువ, ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించి భారత తీరాలకు చేరుకుంటాయి. ఈ మార్గంలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే భారత్‌కు చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై ఇటీవల కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా చమురు ఎగుమతులపై ఒత్తిడి పెంచడం, మాస్కో ఆదాయ వనరులను దెబ్బతీయడం ఉక్రెయిన్‌ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. మరోవైపు, ఇలాంటి దాడులు ప్రపంచ చమురు మార్కెట్లలో అనిశ్చితిని పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్యన్‌ ఓడరేవులపై దాడులు కొనసాగితే భారత్‌తో పాటు రష్యా చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలకూ సరఫరా, ధరల పరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అంతర్జాతీయ మార్కెట్లు, దిగుమతి దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.