రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
అమెరికా దాడులు, హోర్ముజ్ మూసివేత.. ఇరాన్ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు
టెహ్రాన్ : ఇరాన్‌పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా భీకర దాడులు కొనసాగిస్తోంది. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్ కమాండ్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరుపుతోంది.
ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం పేర్కొంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం, అమెరికా నేరుగా రంగప్రవేశం చేయడంతో మరింత తీవ్రమైంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య నేరుగా యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరిగిందని, అనేక నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని వివరించారు.
హోర్ముజ్ జలసంధి ద్వారా 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలించాం. హోర్ముజ్ ద్వారా 200 నౌకలు సురక్షితంగా తరలించాం.
అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అరబ్ దేశాలలో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. అమెరికాకు చెందిన 18 కీలక ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల నడుమ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక ప్రకటన చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో హోర్ముజ్‌ను మూసివేయక తప్పదని స్పష్టం చేసింది. తమ హెచ్చరికలను పక్కనపెట్టి హోర్ముజ్ దాటే నౌకలపై దాడులు తప్పవని హెచ్చరించింది.
హోర్ముజ్ జలసంధి, ఒమన్ తీరప్రాంతంలో తమ ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ చమురును రవాణా చేస్తున్న విదేశీ నౌకలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ విదేశీ నౌకలలో పనిచేస్తున్న భారతీయ నావికులు కూడా ప్రమాదంలో పడుతున్నారని సమాచారం.
ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా తాజాగా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించినట్లు అక్కడి వర్గాలు తెలియజేశాయి. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరాన్, అమెరికా దేశాలు పరస్పరం ఘర్షణ పూరిత చర్యలకు దిగడంతో, శాంతి చర్చలు ఫలితం లేకుండా పోతున్నాయి.







