రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
కర్నూలు నగరంలోని చాణక్యపురి కాలనీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) జోనల్ అధికారి యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. తిరుపతిలోని పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ తనిఖీలు చేసింది. కర్నూలుతో పాటు తిరుపతి, హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడించారు.
ఇప్పటి వరకు రూ.5.87 లక్షల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎస్‌బీఐ లాకర్, రెండు ఇళ్లు, భార్య పేరున 4 ఓపెన్ ప్లాట్లు, 17 తులాల బంగారం, 3 కిలోల వెండి ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్‌లో ఈ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.













