రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షలు విధించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసిన తరహాలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని ఆమె కోరారు.
ఈ నెల 28న వైసీపీ విద్యార్థి యువత ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై విద్యార్థి, యువజన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
డీఎస్సీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాస్తే, ఆ పరీక్షలో కూడా అవకతవాలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఈ అక్రమాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల కలలు విచ్ఛిన్నమయ్యాయని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, అక్రమాలపై మాట్లాడిన వారిపై కాకుండా మాట్లాడని వారిపైనే కేసులు నమోదు చేసే పరిస్థితి నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శించారు. డీఎస్సీ పరీక్షలో జరిగిన అవకతవాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఉద్యమానికి సిద్ధం అవుతామని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై న్యాయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికారు.













