రాయలసీమ న్యూస్, కర్నూలు: కోడుమూరుకి చెందిన నీట్ పరీక్ష రాసిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాల పుష్పావతి (18) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన లక్ష్మీదాసు కుమార్తె పుష్పావతిని అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్‌కు సంతానం లేకపోవడంతో దత్తత ఇచ్చారు. చిన్ననాటి నుంచే ఆమెను వైద్యురాలిని చేయాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ చదివించారు.
పుష్పావతి ఇంటర్ విద్యలో మంచి ప్రతిభ కనబరిచి 965 మార్కులు సాధించింది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యేక శిక్షణ కూడా పొందింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో పాల్గొంది.
నీట్ ఫలితాలు వెలువడిన అనంతరం పుష్పావతి తన మార్కులు చూసుకోగా 347 మార్కులు వచ్చినట్లు తెలిసింది. తాను ఆశించిన స్థాయికి తక్కువ మార్కులు రావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ మనస్తాపం నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పావతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనపై పుష్పావతి తండ్రి లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో అనుగొండ గ్రామంలో విషాదం నెలకొంది. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్యకు పాల్పడటం పట్ల గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.













