రాయలసీమ న్యూస్, కర్నూలు: నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన పచ్చదనం అందించేందుకు నగరంలోని ఉద్యానవనాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం ఆయన పరిమళ నగర్ ఉద్యానవనాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరంలో ఉన్న ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో పార్కులు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే వాటి అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకున్నామని ఆయన వివరించారు.

ఉద్యానవనాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పీపీపీ విధానంలో 37 పార్కులు, సాధారణ నిధులతో 8 పార్కులు, సీఎస్‌ఆర్ నిధులతో మరో 2 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అలాగే సాధారణ నిధులతో మరో 14 పార్కుల్లో ఆధునికీకరణ పనులను చేపట్టినట్లు వెల్లడించారు.
పార్కుల్లో పచ్చదనాన్ని పెంచడం, పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లు నాటడం, నడక మార్గాలు, కూర్చునే బెంచీలు, పిల్లల ఆట స్థలాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజలకు మెరుగైన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందేలా పార్కులను తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఉద్యానవనాల అభివృద్ధి, నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు. పార్కుల సంరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, పచ్చదనాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని ఆయన సూచించినట్లు అధికారులు తెలిపారు.
అంతకుముందు సుంకేసుల రోడ్డులోని రాయల్ టవర్స్ వద్ద డ్రైనేజీ సమస్యను కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గురు రాఘవేంద్ర నగర్‌లో తాగునీటి సమస్యను కూడా ఆయన పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీఈఈ కృష్ణలత, పవన్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇంస్పెక్టర్లు మునిస్వామి తదితరులు కమిషనర్‌తో కలిసి పాల్గొన్నారు.













