రాయలసీమ న్యూస్, కర్నూలు:
తుంగభద్రలో ఇసుక దోపిడీ.. గుత్తేదారులకు కోట్ల జరిమానాలు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఇష్టానుసారంగా సాగిన ఇసుక తవ్వకాలపై గనుల శాఖ బిగుసుకుపోయింది. నిబంధనలు ఉల్లంఘించిన రెండు గుత్తేదారు సంస్థలకు కోట్ల రూపాయల జరిమానాలు విధించింది. దీంతో ప్రస్తుతం డీసిల్టింగ్ పాయింట్ల వద్ద తవ్వకాలు నిలిచిపోయాయి. ఇన్ఫ్రా
తుంగభద్ర నదిలో ఇసుక దోపిడీ జరుగుతోందని వరుస ఫిర్యాదులు రావడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలు రావడంతో గనుల శాఖ అప్రమత్తమైంది. ఆంధ్ర ప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఏపీ శాక్) సాయంతో నదిలోని రీచ్‌లను ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలించింది. ఈ క్రమంలో అనధికారికంగా తవ్విన ఇసుక పరిమాణాన్ని గుర్తించింది.
కర్ణాటకకు చెందిన జేపీ పవర్ వెంచర్స్ , ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని తేలడంతో ఏడాది క్రితమే ఈ రెండు సంస్థలకు తాఖీదులు జారీ చేశారు. ఏఏ రీచ్‌లలో ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిగాయి? ఎంత ఇసుక తరలించారు? జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రశ్నించారు. అయితే సంస్థలు తగిన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఇటీవలే జరిమానాలతో కూడిన డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో 2021 మే నుంచి 2023 నవంబరు వరకు తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలకు జేపీ పవర్ వెంచర్స్‌కు, 2023 నవంబరు నుంచి డిసెంబరు వరకు ప్రతిమ ఇన్ఫ్రా కు, ఆ తర్వాత 2023 డిసెంబరు నుంచి 2024 జూన్ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మళ్లీ JP సంస్థకు అనుమతులు ఇచ్చారు. అయితే అనుమతులున్న రీచ్‌లలోనే కాకుండా అనుమతులే లేని ప్రాంతాల్లో కూడా భారీ యంత్రాలతో ఇసుక తవ్వినట్లు గనుల శాఖ విచారణలో బయటపడింది.
బిల్లులు లేకుండా ఇసుకను తరలించడం, ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించడం ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.జేపీ పవర్ వెంచర్స్ఇసుక తవ్వకాలు చేపట్టిన కాలంలో సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె, కె.సింగవరం, కొత్తకోట, ముడుమాల, కొండాపురం, పల్దొడ్డి ప్రాంతాల్లోని రీచ్‌లను నాటి వైకాపా ప్రజాప్రతినిధులు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తుంగభద్ర నది లోపల బోట్ల సాయంతో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను తోడేశారని స్థానికులు చెబుతున్నారు.
సి.బెళగల్ మండలంలో 2021 డిసెంబరు నుంచి 2024 వరకు రెండేళ్లలో 1.08 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లు అంచనా. కౌతాళం మండల పరిధిలో నదిచాగి, గుడికంబాలి–1, 2, 3, మరళి–1, 2, నందవరం మండలం నాగలదిన్నె రీచ్‌లలో 2021 నుంచి 2024 మార్చి వరకు లక్ష వాహనాల ద్వారా కోటి మెట్రిక్ టన్నుల ఇసుక తరలించినట్లు గనుల శాఖ లెక్కలు సూచిస్తున్నాయి.
మొదట టన్ను ఇసుకను రూ.375కు, తరువాత రూ.475కు విక్రయించారు. ట్రాక్టర్ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు, లారీ, టిప్పర్ ఇసుకను రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన రూ.వందల కోట్లు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు చిల్లిగవ్వ కూడా జమ చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా 2023 డిసెంబరు 11 నుంచి 2024 ఫిబ్రవరి వరకు కౌతాళం మండలం గుడికంబాలిలో రెండు, మరళి–1 కలిపి మూడు రీచ్‌లలో పర్యావరణ అనుమతులు లేకుండానే 3.60 లక్షల టన్నుల ఇసుకను తవ్వి హైదరాబాద్ , కర్ణాటక ప్రాంతాలకు తరలించినట్లు గనుల శాఖ గుర్తించింది. ఈ అక్రమాలపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం.













