ఎమ్మిగనూరు పట్టణంలోని గురు నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆదివారం సంచలనం రేపింది. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన నిశాంత్‌ (12) అనే విద్యార్థి మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. మాచాపురం గ్రామానికి చెందిన సుధాకర్‌ తన కుమారుడు నిశాంత్‌ను ఐదు రోజుల క్రితం ఎమ్మిగనూరు పట్టణంలోని గుడేకల్‌ రోడ్డులో ఉన్న గురు నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో వదిలి వెళ్లాడు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్న నిశాంత్‌ను ఆదివారం చూడటానికి తండ్రి సుధాకర్‌ సెంటర్‌కు వచ్చాడు.

ఈ సందర్భంగా నిశాంత్‌ తండ్రికి తనకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇక్కడ ఉండలేనని చెప్పినట్లు సమాచారం. దీనిపై తండ్రి అతడిని మందలించి తిరిగి వెళ్లిపోయాడు. తండ్రి మందలింపు, అక్కడ ఉండాల్సిన పరిస్థితి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన నిశాంత్‌ కోచింగ్‌ సెంటర్‌ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు.

అయితే అదృష్టవశాత్తూ అతడు నేరుగా రోడ్డుపై కాకుండా అక్కడ పార్క్‌ చేసి ఉన్న మోటార్‌బైక్‌ సీటుపై పడడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనను గమనించిన అక్కడి విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు వెంటనే స్పందించి నిశాంత్‌ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మోటార్‌బైక్‌ సీటుపై పడటంతో ఊపిరితిత్తుల భాగంలో ఒత్తిడి ఏర్పడినట్లు తెలిపారు. నిశాంత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన సమయంలో నిశాంత్‌ నేరుగా రోడ్డుపై పడిపోయి ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తప్పదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఘటన సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కోచింగ్‌ సెంటర్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు సాయంత్రం వెల్లడించారు. నిశాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.