న్యూఢిల్లీ : ప్రభుత్వ నిధులను అధికారుల సొంత ప్రయోజనాలకు మళ్లించారన్న కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆదివారం రాత్రి వరకు విస్తృత సోదాలు నిర్వహించింది. హరియాణా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కొందరు అధికారులు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఏయూ ఫైనాన్స్‌ బ్యాంకుల సిబ్బందితో కుమ్మక్కై భారీ స్థాయిలో నిధులను దారి మళ్లించారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

సీబీఐ నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం, ప్రభుత్వానికి చెందిన వివిధ ఖాతాల నుంచి మొత్తం రూ.661 కోట్ల నిధులను అక్రమంగా మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మళ్లింపులో విపం కన్సల్టెన్సీ అనే సంస్థ కీలక పాత్ర పోషించినట్టు విచారణలో బయటపడింది. ఆ సంస్థ సహకారంతోనే నిధుల బదిలీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో చండీగఢ్‌, పంచకుల, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, నోయిడా ప్రాంతాల్లో ఉన్న ఆరు చోట్ల సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారులకు చెందిన నివాసాలు, కార్యాలయాలు, సంబంధిత రికార్డులపై దర్యాప్తు బృందాలు తనిఖీలు జరిపాయి. నోయిడాలోని విపం కన్సల్టెన్సీ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్‌ నివాసాలపై కూడా సోదాలు చేపట్టారు.

ప్రాథమిక విచారణలో ఎనిమిది విభాగాలకు చెందిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి గురైనట్టు సీబీఐ గుర్తించింది. బ్యాంకు అధికారుల సాయంతో ఒక పద్ధతి ప్రకారం నిధులను ముందుగా విపం కన్సల్టెన్సీ ఖాతాలకు మళ్లించి, అనంతరం సంబంధిత అధికారులు తమ సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిధుల మళ్లింపుపై నమోదైన ఈ కేసులో మరిన్ని ఆధారాలు, పత్రాలు సేకరించేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. సంబంధిత అధికారులు, బ్యాంకు సిబ్బంది, విపం కన్సల్టెన్సీ ప్రతినిధులను విచారించే ప్రక్రియలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నట్టు సమాచారం. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని దర్యాప్తు సంస్థ వర్గాలు సూచిస్తున్నాయి.