కేంద్ర హోం మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురిలో ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, పరిపాలన సంస్కరణలతో పాటు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్‌ (Chicken Neck Corridor) భద్రతను ఈ సమావేశంలో సమీక్షించారు.

భారత్‌లోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే సిలిగురి కారిడార్‌ దేశ భద్రత పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించబడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రంగ్‌పో రైల్వే ప్రాజెక్టు, సైనిక రవాణా, జాతీయ భద్రత దృష్ట్యా ఈ ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై సమావేశంలో చర్చ జరిగింది.

అమిత్ షా దబ్‌గ్రామ్-ఫుల్‌బారీ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, BSF సిబ్బందితో మాట్లాడి సరిహద్దు ప్రాంతాల్లో అమలులో ఉన్న భద్రతా చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ కీలక సమావేశంలో సరిహద్దు వెంబడి జరుగుతున్న అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన అదనపు చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న నేర ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం, జనన-మరణ నమోదు వ్యవస్థలను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, అక్రమ వలసలు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంలో పరిపాలన సంస్కరణల పాత్ర, డిజిటల్ రికార్డు వ్యవస్థల ద్వారా అక్రమ వలసలను గుర్తించే విధానాలు, స్థానిక స్థాయిలో నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం వంటి అంశాలపై అధికారులు అమిత్ షా కు వివరాలు అందించారు.

సిలిగురిలో జరిగిన ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి , రాష్ట్ర ఉన్నత పరిపాలనా అధికారులు, డార్జిలింగ్, జల్ పైగురి , కాలింపాంగ్ , అళిపురుడుఅర్ , కూచ్ బీహార్ , ఉత్తర దీనజపూర్ , దక్షిణ దీనజపూర్ , మాల్డా నియోజకవర్గాల ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. సరిహద్దు ప్రాంతాల ప్రజల భద్రత, అక్రమ రవాణా, నేర కార్యకలాపాల నియంత్రణ, పరిపాలన పారదర్శకత వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడం, ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా భావించబడుతున్న సిలిగురి కారిడార్‌ రక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్ష సమావేశం దోహదపడనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.