రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ప్రాణాంతకంగా మారింది. చీర కొనివ్వలేదన్న కారణంతో ప్రారంభమైన వాగ్వాదం, భర్త హత్యకు దారి తీసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హరేరామ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవితో కలిసి శిర్గావ్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం సునీతా దేవి తనకు చీర కొనివ్వాలని భర్తను కోరింది. అయితే హరేరామ్ సింగ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీతా దేవి కిచెన్‌లో ఉన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని భర్త తలపై బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దెబ్బ తగిలి హరేరామ్ సింగ్ నేలకుపడగా, అనంతరం అతని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హరేరామ్ సింగ్ అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితమై ఉండడంతో, తనపై జరిగిన దాడికి ప్రతిఘటించలేకపోయినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఘటన అనంతరం పోలీసులకు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన సునీతా దేవి, మొదట సమాచారం ఇచ్చి తనపై ఉన్న అనుమానాలను తొలగించుకోవాలని చూశిందని పోలీసులు వెల్లడించారు. అయితే హత్య సమయంలో వారి 7 ఏళ్ల కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆ చిన్నారిని పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా సునీతా దేవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
భార్య భర్తల మధ్య గొడవలు కొత్తవి కావని, ఈ దంపతుల మధ్య గతంలో కూడా తరచూ విభేదాలు జరిగేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ హత్య కేవలం చీర కొనివ్వలేదన్న కారణంతోనే జరిగిందా, లేక దీని వెనుక కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో బద్లాపూర్ ఈస్ట్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే హత్య సమయంలో ఇంట్లో వేరే ఎవరైనా ఉన్నారా, ఘటన అనంతరం ఆనవాళ్లు తుడిచేయడానికి ప్రయత్నించారా అనే అంశాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. స్థానికుల సమాచారం, బాలుడు ఇచ్చిన సాక్ష్యం, ఫోరెన్సిక్ ఆధారాలు ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఈ ఘటనతో శిర్గావ్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.







