భారత్‌లో తయారైన తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ విజయవంతం

భారతీయ విమానయాన, రక్షణ రంగాల చరిత్రలో గురువారం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా పూర్తిగా స్వదేశంలో తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎయిర్ బస్సు C295 మిలిటరీ రవాణా విమానం తన తొలి టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ విమానం గగనతలంలోకి ఎగిరి చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది.

విమానం తయారీ ప్రక్రియలో టెస్ట్ ఫ్లైట్ దశ అత్యంత కీలకమని ఎయిర్ బస్సు డిఫెన్సె సంస్థ పేర్కొంది. విమానం పనితీరు, భద్రత, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ సమగ్రంగా పరీక్షించే ఈ దశను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్ట్ తదుపరి కార్యక్రమాలకు మార్గం సుగమమైంది. సంస్థ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించింది.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘Make In India’ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. మొత్తం 56 ఎయిర్ బస్సు C295 విమానాలను భారత వైమానిక దళం కోసం కొనుగోలు చేయగా, అందులో 16 విమానాలను విదేశాల్లో తయారు చేసి అందించనున్నారు. మిగిలిన 40 విమానాలను దేశంలోనే తయారు చేయాల్సి ఉంది. వాటిలో వడోదరలో అసెంబుల్ చేసిన మొదటి విమానం ఇదే.

ఈ విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్‌తో ఈ ఏడాది చివర్లోనే తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ C295 విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అందించే దిశగా పనులు వేగవంతమయ్యాయి. దేశ రక్షణ రంగంలో ఈ ప్రాజెక్ట్‌ను నిపుణులు ‘గేమ్ చేంజర్’గా అభివర్ణిస్తున్నారు. కారణం, భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థ భాగస్వామ్యంతో మిలిటరీ విమానాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం.

ఎయిర్ బస్సు సంస్థతో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ , దేశవ్యాప్తంగా విమాన విడిభాగాలను తయారు చేస్తున్న అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉమ్మడి కృషి ఫలితమే ఈ విజయం. భారత వైమానిక దళం, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి Airbus సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. భారతీయ విమాన తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ పేర్కొంది.

ఈ చారిత్రాత్మక విజయంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా హర్షం వ్యక్తం చేసింది. తొలి C295 విమానం విజయవంతంగా ఎగరడం వెనుక ఉన్న మొత్తం బృందానికి ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపింది. ఈ విజయం భారత విమాన తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా, ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణంలో స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీపై దేశం చూపుతున్న కట్టుబాటును మరోసారి రుజువు చేసిందని IAF తన సందేశంలో పేర్కొంది.