డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు పునాది

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

 డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు, సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి

ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘నశా ముక్త్ యువ’ కార్యక్రమం కేవలం వ్యక్తుల కోసం మాత్రమే కాదని, కుటుంబాలు, సమాజం, దేశం కోసం చేపడుతున్న ఉద్యమమని అన్నారు. భారత్‌ను వికసిత్ భారత్‌గా మార్చే లక్ష్యంలో ఆరోగ్యవంతమైన యువత కీలక పాత్ర పోషిస్తుందని మోడీ పేర్కొన్నారు. యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు.

కాశీ నుంచి దేశవ్యాప్త ఉద్యమంగా..

ఈ కార్యక్రమాన్ని తొలుత గత ఏడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా విస్తరించిన ఉద్యమంగా మారిందన్నారు. కాశీ ఎంపీగా ఈ కార్యక్రమం తన నియోజకవర్గం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు. శాస్త్రీయ అవగాహనతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ఈ కార్యక్రమం కలిగి ఉందని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం దేశవ్యాప్తంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈ ప్రచారంలో భాగస్వాములయ్యాయని ప్రధాని తెలిపారు. కోట్లాది మంది ప్రజల సంక్షేమం కోసం సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నాయని చెప్పారు.

కలిసికట్టుగా పనిచేస్తేనే డ్రగ్స్‌పై విజయం

మాదకద్రవ్యాల దుర్వినియోగంపై పోరాటాన్ని వ్యక్తిగత ప్రయత్నాలతో మాత్రమే గెలవలేమని ప్రధాని మోడీ అన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే పెద్ద మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని, తమ పాఠశాలలు, కళాశాలలు, సమాజాల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారని మోడీ తెలిపారు. ఈ యువత తీసుకున్న సంకల్పం రాబోయే 100 వారాల పాటు కొనసాగనున్న దేశవ్యాప్త ప్రచారానికి మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు.

ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు

‘నశా ముక్త్ యువ’ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.