ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోదీ

మంత్రివర్గం అభినందనలు

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు పదవిలో కొనసాగుతూ చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర క్యాబినెట్ ఒక అభినందన తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం ఇక్కడ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధానమంత్రిని అభినందిస్తూ మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4,399 రోజుల సుదీర్ఘ పాలనతో కొత్త రికార్డు నెలకొల్పారు. తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 4,398 రోజులు పదవిలో కొనసాగారు. ఆ రికార్డును మోదీ నేటితో అధిగమించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

సుపరిపాలన, ప్రజాసేవలపై ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించారు. ప్రజాసేవే సుపరిపాలనకు అసలైన పరీక్ష అని, వినయం, అంకితభావం, కర్తవ్యనిష్ఠతో అవిశ్రాంతంగా పనిచేసినప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ 12 ఏళ్ల పాలనను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. వలస పాలకుల కాలంలో ఏర్పడిన న్యూనతను ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా అధిగమించిందని ఆయన అభినందించారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కోట్లాది మంది ప్రజల ప్రేమ, నమ్మకం, ప్రజాదరణతో సుదీర్ఘకాలం పాలన అందించిన క్రెడిట్ ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. సాధికారత, అభ్యుదయం, అభివృద్ధి, స్వయం సమృద్ధి భారత్‌ నిర్మాణంలో మోదీ 4,399 రోజుల ప్రయాణం ఒక సువర్ణాధ్యాయమని చౌహాన్ అభివర్ణించారు.

మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మన్షుక్ మాండవీయ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు సమాచారం.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం శుభాకాంక్షల సందేశం పంపారు. ప్రపంచ వేదికపై ఆర్థిక, సాంకేతిక, సైనిక రంగాల్లో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలలో భారత నాయకత్వం పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు.

భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ప్రధానమంత్రి మోదీ రాజకీయ ప్రయాణాన్ని శ్లాఘించారు. ఎన్నికైన ప్రధానిగా దేశానికి సుదీర్ఘకాలం సేవలందిస్తున్న నరేంద్ర మోదీని అభినందిస్తూ, దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న ప్రజాసేవ, నాయకత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. మోదీకి ఆల్ ద బెస్ట్ తెలిపారు.