అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ

వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నీట్ - 2026 పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన అర్ధరాత్రి వేళ పోస్ట్ చేసిన జెన్-జీ స్టైల్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఒక్క వీడియోతో ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు కేవలం 24 గంటల్లోనే దాదాపు వన్‌ మిలియన్‌ (10 లక్షల) మంది కొత్త ఫాలోవర్లు పెరిగారు. అలాగే.. ఆయన పోస్ట్ చేసిన ఈ ఇన్‌స్టా రీల్ కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్‌ (దాదాపు 30.3 కోట్ల) వీక్షణలు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. 2026 ఫిఫా (FIFA) ప్రపంచ కప్ ఫైనల్ కోసం చేసిన ‘ఐషో స్పీడ్‌’ వీడియో పేరిట ఉన్న 30 కోట్ల (300 మిలియన్లు) వ్యూస్ రికార్డును మోదీ వీడియో బీట్‌ చేసింది. 

ప్రస్తుతం ఇన్‌స్టాలో 100 మిలియన్ (10.2 కోట్ల) ఫాలోవర్లతో తొలి గ్లోబల్ లీడర్‌గా మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన ఈ వీడియోపై రీల్స్‌కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘ఫ్రెండ్స్‌’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ జెన్‌ జీ పరిభాషలో మాట్లాడడంతో అందరూ దీనిపై రీల్స్‌ చేస్తున్నారు. మోదీ అనుసరిస్తున్న ఈ సరికొత్త సోషల్ మీడియా ట్రెండ్‌ యువతను, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) తరాన్ని విశేషంగా ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం తాను విడుదల చేసిన వీడియోకు విద్యార్థుల నుంచి భారీ స్పందన రావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోను విడుదల చేశారు. అంతకుముందు, మంత్రులందరూ సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండాలని, యువతతో మమేకమవుతూ ముందుకు సాగాలని క్యాబినెట్‌ భేటీలో ప్రధాని సూచించారు.