ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నేటి యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం లేనిదో, దారి తప్పిందో కాదని, వారిని అర్థం చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం కాకుండా అర్థవంతమైన చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసనలతో వాతావరణం వేడెక్కిన సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘విశ్వ మాంగల్య సభ’ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ తరాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. నేటి యువత తత్వం, కుటుంబాల్లో సంభాషణల లోపం, పెద్దల బాధ్యతలపై ఆయన దృష్టి సారించారు.

“మేము యువకులుగా ఉన్నప్పుడు విధేయత చూపించే వాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేటి తరం ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి మనం వారికి ప్రతి విషయాన్ని కారణాలతో సహా వివరించాల్సి ఉంటుంది. వారిపై ఎనలేని ప్రేమను చూపిస్తూ, వారితో సమయం గడపాలి. కుటుంబాల్లో సంభాషణలు తగ్గిపోతుండటం ఆందోళనకరం. యువత నమ్మకాన్ని గెలవాలంటే హుకుం జారీ చేయడం కాదు, వారితో మాట్లాడాలి. వారికి ఓ ఆత్మీయ భావన కలిగించాలి. ఆదేశాలు జారీ చేయడం కాకుండా చర్చలు జరిపి, ఒక ఏకాభిప్రాయానికి రావడం ముఖ్యం”

జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల గురించి మోహన్ భగవత్ ప్రత్యక్షంగా ఎలాంటి ప్రస్తావన చేయకపోయినా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు విశేష చర్చనీయాంశంగా మారాయి. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ సీజేపీ నిరసనలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాయి.

ఈ నిరసనలపై మోహన్ భగవత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక ప్రకటన చేయలేదు. ముఖ్యంగా జూలై 20న పార్లమెంట్ సమీపంలో నిరసనకారులు, పోలీసులు మధ్య జరిగిన ఘర్షణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. ఆ ఘటనల తర్వాత విద్యార్థి సంఘాలు, పౌరసంఘాలు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ (X) ద్వారా మోహన్ భగవత్‌పై విమర్శలు చేశారు.

“మోహన్ భగవత్ గారు, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పరిణామాలపై గత నెల రోజులుగా మీరు పాటిస్తున్న మౌనం మీ ఉపన్యాసాల కంటే చాలా శక్తివంతంగా ఉంది”

అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యత, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న తరుణంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు, ఆయనపై వస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి.