చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.10,000 కోట్ల MSME గ్రోత్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. ఈ నిధి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడుల అందుబాటు పెంచి, వాటి విస్తరణ, ఆధునీకరణకు తోడ్పడేలా చర్యలు తీసుకోనున్నారు.

MSMEల వృద్ధిని వేగవంతం చేయడం, వాటి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ గ్రోత్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధి ద్వారా ఎంపిక చేసిన MSMEలకు ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అందించనున్నారు. దీంతో బ్యాంకు రుణాలపై మాత్రమే ఆధారపడకుండా, మూలధన పెట్టుబడుల ద్వారా సంస్థల సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం లభించనుంది.

దేశ ఆర్థిక వ్యవస్థలో MSMEలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, వాటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా భారీ నిధిని కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడం, ఉత్పాదకత మెరుగుపడడం, ఎగుమతులు విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని కేంద్రం భావిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షలాది చిన్న, మధ్యతరహా యూనిట్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

ఇక రవాణా, సరుకు రవాణా రంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా రహదారి, రైల్వే, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు వంటి మౌలిక వసతులను సమన్వయం చేసి, ఒకే దిశలో అభివృద్ధి చేయడానికి ITLA కీలక పాత్ర పోషించనుంది.

రవాణా వ్యవస్థలో ఉన్న బొట్లేనెక్స్ తొలగించడం, సరుకు రవాణా ఖర్చులను తగ్గించడం, సమయపాలన మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం ITLA ప్రధాన లక్ష్యాలుగా కేంద్రం నిర్ణయించింది. ఈ అథారిటీ ఏర్పాటుతో పరిశ్రమలు, వ్యాపారాలకు సరుకు రవాణా మరింత సులభం కావడంతో పాటు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెరగనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

MSME గ్రోత్ ఫండ్, ITLA ఏర్పాటుతో పరిశ్రమల అభివృద్ధి, రవాణా రంగంలో సమన్వయపూర్వక మార్పులకు మార్గం సుగమం అవుతుందని, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి బలమైన పునాది వేస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.