రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఆయిల్ ధరలో స్థిరత్వం వస్తే సర్‌ఛార్జ్ పై పునరసమీక్ష
: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
పశ్చిమాసియాలో ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఏటీఎఫ్ ధరలూ ఆకాశాన్ని తాకాయి. దీంతో విమానయాన కంపెనీలు ఫ్యూయల్ సర్‌ఛార్జీలు, అదనపు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చమురు ధరలు చల్లారాయి. మరికొంతకాలం పాటు ఇదే స్థాయిలో చమురు ధరలు స్థిరంగా కొనసాగితే.. సర్‌ఛార్జీల అంశాన్ని సమీక్షించాలని విమానయాన సంస్థలను కోరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి దేశీయంగా ఏటీఎఫ్ ధరలను నిర్ణయిస్తున్నారు. మరోవైపు, ఏవియేషన్ సెక్టార్‌కు మద్దతు ఇచ్చేందుకు రూ.10వేల కోట్లతో స్టెబిలైజేషన్ ఫండ్‌ను కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వం సమీక్షిస్తోందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ‘‘చమురు ధరలు ఈ మధ్య కాలంలో దిగి వచ్చాయి. దీర్ఘకాలం పాటు ఇవే ధరలు కొనసాగితే ఎయిర్‌లైన్ సంస్థలతో మాట్లాడతాం. సర్‌ఛార్జి, అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా కృషి చేస్తాం’’ అని కేంద్రమంత్రి తెలిపారు. మరికొంతకాలం పాటు ధరల హెచ్చుతగ్గులను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.







