రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ స్వరూపం, దాని చట్టపరమైన ప్రాముఖ్యతపై కొనసాగుతున్న చర్చల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం విదేశాలకు ప్రయాణించేందుకు ఉపయోగించే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ మరోసారి స్పష్టం చేసింది.
పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. పాస్‌పోర్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు గతంలోనూ పలు తీర్పులు, ఆదేశాల ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ, పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ రుజువుగా పరిగణించాలా లేదా అన్న అంశంపై అప్పుడప్పుడూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రిత్వశాఖ తాజా వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకారం, పాస్‌పోర్ట్ ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రాథమిక పత్రంగా దానిని చూడకూడదని స్పష్టంగా పేర్కొంది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు వేర్వేరు చట్టాల పరిధిలోకి వస్తాయని, పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ మాత్రం ప్రయాణ సౌలభ్యానికి సంబంధించినదేనని మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.
ఇక భారతదేశ పాస్‌పోర్ట్ సేవల విస్తరణ, ఆధునీకరణపై కూడా మంత్రిత్వశాఖ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు చిప్ ఆధారిత ఇ-పాస్‌పోర్ట్‌ల అమలు విజయవంతంగా కొనసాగుతోందని తెలిపింది.
2025 సంవత్సరంలో మొత్తం 1.5 కోట్ల పాస్‌పోర్ట్‌లు, సంబంధిత సేవలను అందించామని, అందులో 1.39 కోట్ల వరకు పాస్‌పోర్ట్‌ల జారీ జరిగిందని మంత్రిత్వశాఖ వివరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగం గణనీయంగా మెరుగుపడిందని, సాధారణంగా ఆరు పనిదినాలలోపు పాస్‌పోర్ట్‌లు అందజేయగలుగుతున్నామని పేర్కొంది.
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో పౌరులు గడిపే సగటు సమయం కూడా తగ్గిందని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దరఖాస్తుదారులు సగటున 45 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే కేంద్రాలలో గడుపుతున్నారని వివరించింది. అయితే పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఇంకా కొంత ఎక్కువ సమయం పడుతోందని, ఈ దశను మరింత వేగవంతం చేయడానికి చర్యలు అవసరమని మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది.
పాస్‌పోర్ట్ సేవల సామర్థ్యాన్ని పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం, సాంకేతికతను వినియోగించి పౌరులకు వేగవంతమైన సేవలు అందించడం మంత్రిత్వశాఖ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. పాస్‌పోర్ట్ స్వరూపంపై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ, పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను వేరు చేసి చూడాలని కేంద్రం ఈ సందర్భంగా సూచించింది.







