రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట
ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట వల్ల డజన్ల కొద్దీ భక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా దర్శనంకోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడటంతో గ్రాండ్ రోడ్ (బడా దండా)పై ఈ గందరగోళం చెలరేగింది. అధికారులు, అత్యవసర బృందాలు సుమారు 120 మంది భక్తులను రక్షించి, వారికి తక్షణ చికిత్స కోసం పూరీ జిల్లా ఆసుపత్రికి, సమీపంలోని వైద్య కేంద్రాలకు తరలించారు. గుంపు నుండి అందిన ప్రాథమిక క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం భక్తులు తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియగానే, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికార బృందాలు వెంటనే ప్రత్యేక సహాయక బృందాలను రంగంలోకి దించి, జన సమూహ నియంత్రణ చర్యలను ముమ్మరం చేశాయి.
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందినట్లు సమాచారం. ఊపిరాడక స్పృహ కోల్పోయిన అతడిని వెంటనే పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మరణంపై ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఘటన సమాచారం అందుకున్న ప్రత్యేక సహాయక బృందం (SRU), పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతంలో చిక్కుకున్న భక్తులను బయటకు తీసుకువచ్చి వైద్య సేవలు అందించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు గ్రాండ్ రోడ్‌లో జనసమూహాన్ని నియంత్రించేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు. భక్తులు సురక్షితంగా రథయాత్రను వీక్షించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, జగన్నాథ రథయాత్ర గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. 12వ శతాబ్దానికి చెందిన శ్రీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు. గంటల మోతలు, శంఖారావాల మధ్య చక్రరాజ సుదర్శనుడిని ముందుగా ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చి సుభద్రాదేవి రథంపై ప్రతిష్ఠించారు. తర్వాత సుభద్రాదేవి విగ్రహాన్ని సంప్రదాయ ‘శూన్య పహండి’ వేడుకలో రథం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం బలభద్రుడు, చివరగా జగన్నాథ స్వామి విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకురాగానే భక్తులు “జై జగన్నాథ్” నినాదాలతో గ్రాండ్ రోడ్‌ను మార్మోగించారు. అయితే భారీ జనసందోహం కారణంగా ఏర్పడిన రద్దీ ఈసారి రథయాత్రలో ఆందోళనకర పరిస్థితులకు దారితీసింది.







