సిందూర్‌లో అమరుల జాబితా..

అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మన దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. వారి పేర్లను నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ (National War Memorial)అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్‌ దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. వీరి పేర్లను దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ సర్కిల్‌లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు. ఆ అమరుల వివరాలు ఇలా..

  • 1. సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ - 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌

  • 2. రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌ - జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 4వ బెటాలియన్‌

  • 3. లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌ - 5 ఫీల్డ్‌ రెజిమెంట్‌

  • 4. హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ - 237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌

  • 5. సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ - ఎయిర్‌ఫోర్స్‌ 39వ వింగ్‌

  • 6. అగ్నివీర్‌ మురళీ నాయక్‌ - 851 లైట్‌ రెజిమెంట్‌

వీరిలో రైఫిల్‌మ్యాన్‌ సునీల్ కుమార్‌ను కేంద్రం మరణానంతరం మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’తో సత్కరించింది. ఇక, సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ను ‘వాయు మెడల్‌’తో గౌరవించింది. ఇక, వీరిలో మురళీ నాయక్‌ తెలుగు వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన మురళీ.. 2022లో అగ్నివీర్‌గా ఎంపికై తొలుత పంజాబ్‌, అస్సాంల్లో పనిచేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాక్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. 2025 ఏప్రిల్‌ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ విరుచుకుపడింది.