రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఉద్దవ్ సేనలో చీలిక..
విప్ ధిక్కరించి కీలక సమావేశానికి ఆరుగురు ఎంపీలు గైర్హాజరు
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. ఆరుగురు ఎంపీలు సమావేశానికి డుమ్మాకొట్టారు.
శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది.
మొత్తం తొమ్మిది మంది UBT లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్ ఠాక్రే సీరియస్‌గా తీసుకున్నారు. హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది.
మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్‌కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.







