దేశ విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, ఇటీవల వెలుగులోకి వచ్చిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై నిరసనగా 20 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్ష విరమణకు మూడు షరతులు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు.

దిల్లీలోని స్ఫడర్జున్గ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని సోనమ్ వాంగ్‌చుక్ ఆరోపించారు. దీక్షను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం, దేశ రాజకీయ నాయకులకు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు. ఈ మూడు షరతులు నెరవేరితే సోమవారం నుంచే నిరాహార దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

వాంగ్‌చుక్ ఉంచిన మొదటి షరతు ప్రకారం, దేశ విద్యా వ్యవస్థలో ఉన్న వైఫల్యాలతో పాటు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

రెండో షరతుగా, నీట్ పేపర్ లీక్ అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బలంగా లేవనెత్తుతామని దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వాలని వాంగ్‌చుక్ కోరుతున్నారు. ఈ అంశంపై రాజకీయ నాయకుల నుంచి స్పష్టమైన భరోసా రావాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.

మూడో షరతుగా, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ మార్చ్‌లో తాను పాల్గొనలేని పరిస్థితి వస్తే, అగ్ర రాజకీయ నాయకులే స్వయంగా ఆసుపత్రికి వచ్చి, పై రెండు అంశాలపై వ్యక్తిగతంగా తనకు హామీ ఇవ్వాలని వాంగ్‌చుక్ కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఆదివారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.

వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ఆయన స్వచ్ఛందంగా ఆసుపత్రిలో చేరేందుకు ముందుకు రాకపోవడంతో, ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే బలవంతంగా ఆసుపత్రికి తరలించే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వాంగ్‌చుక్ సమ్మతితోనే చికిత్స అందిస్తున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు.