దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజీ (NEET-UG) ప్రశ్నపత్ర లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ NTAలకు అత్యున్నత న్యాయస్థానం పలు ముఖ్య ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, వ్యవస్థాగతంగా శాశ్వత సంస్కరణలు ఏవీ చేపడుతున్నారో సమగ్రంగా వివరించే నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న లోపాలను సరిదిద్దడానికి కేవలం తాత్కాలిక చర్యలు మాత్రమే సరిపోవని, శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ప్రశ్నపత్రాల రవాణాకు వైమానిక దళాన్ని వినియోగించడం వంటి చర్యలు తాత్కాలికంగా ఉపయోగపడే మార్గాలేనని జస్టిస్ నరసింహ సూచించారు.

భవిష్యత్తులో విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడకుండా ఉండేందుకు ప్రతిపాదించిన గవర్నింగ్ బోర్డు, నిపుణుల బృందాలు, హైపవర్డ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏ విధంగా అమలు చేస్తున్నారో వివరించే నివేదికను ఇవ్వాలని కోర్టు కోరింది. ప్రత్యేకించి డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పారదర్శకత, పరిశోధన, పరిపాలన, మానవ వనరులు సహా మొత్తం పది కీలక విభాగాల్లో సాధించిన పురోగతిని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని NTAకి ఆదేశాలు జారీ చేసింది.

ఇదే సందర్భంగా పరీక్షల సెక్యూరిటీ, పర్యవేక్షణ, విజిలెన్స్ కోసం ప్రత్యేకంగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్ పాత్ర, ఆయన పనితీరుపై కూడా సుప్రీంకోర్టు నివేదిక కోరింది. పరీక్ష జరగడానికి ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత ఇలా ప్రతి దశలోనూ తీసుకుంటున్న రక్షణ చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

పరీక్షా కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల ముద్రణ నుంచి వాటి రవాణా వరకు అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని కోర్టు సూచించింది. మరోవైపు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మారడం, విద్యార్థుల సమాచార రక్షణ (డేటా ప్రొటెక్షన్), అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ కోసం ‘డిజియాత్ర’ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించే అంశాలపై కేంద్రం ప్రతిపాదనలు సవివరంగా తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది.

ప్రస్తుతం దాఖలైన అఫిడవిట్‌లో ఈ వివరాలేవీ స్పష్టంగా లేవని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈ అంశాలన్నింటినీ చేర్చుతూ త్వరలోనే కొత్తగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారు.

కేవలం నివేదికలు తీసుకోవడమే కాకుండా, ఈ సంస్కరణల అమలు తీరును ఏడాది పొడవునా తాము నిశితంగా పరిశీలిస్తూనే ఉంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.