రైలు టికెట్ల బుకింగ్‌ సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తున్నారు. అనవసర క్యాప్చాలు, తరచూ వచ్చే పాప్‌అప్‌లు, ప్రతి క్లాస్‌లో సీట్ల లభ్యత తెలుసుకోవడానికి పేజీలు మారుస్తూ ఉండాల్సిన పరిస్థితి వంటి సమస్యలకు త్వరలో ముగింపు కానుంది. మరింత వేగవంతమైన, సులభతరమైన టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని అందించేందుకు కొత్త వెబ్‌సైట్‌ రూపకల్పనను ఐఆర్‌సీటీసీ చేపట్టింది.

ఈ క్రమంలో కొత్త బీటా వెర్షన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి కొత్త వెబ్‌సైట్‌ను మరికొన్ని నెలల్లో ప్రయాణికుల వినియోగానికి అందుబాటులోకి తేనున్నట్లు వారు వెల్లడించారు.

కొద్ది వారాల క్రితం రాజస్థాన్‌లోని మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎంఎన్‌ఐటీ విద్యార్థులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఐఆర్‌సీటీసీ, సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అధికారులు ఎంఎన్‌ఐటీ విద్యార్థులతో దిల్లీలో సమావేశమై కొత్త బీటా వెర్షన్‌ను వారికి ప్రదర్శించారు.

ప్రస్తుతం కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను భారతీయ రైల్వేల ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇంజిన్‌తో అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. బీటా వెర్షన్‌లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు మార్పులు చేశారు. ముఖ్యంగా అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లు, మెరుస్తూ ఉండే గ్రాఫిక్స్‌ను తొలగించారు. దీంతో వెబ్‌సైట్‌ వేగంగా పనిచేసే అవకాశం ఉండడంతోపాటు టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల్లో సీట్ల లభ్యత కనిపించేలా కొత్త రూపకల్పన చేశారు. దీంతో ప్రతి క్లాస్‌ను విడివిడిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. టికెట్‌ బుకింగ్‌కు అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. ప్రయాణికుల వివరాలను సేవ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. తరచూ ప్రయాణించే వారు ప్రతిసారీ అవే వివరాలను మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తోపాటు వివిధ రైల్వే టికెట్‌ బుకింగ్‌ యాప్‌లకు ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇంజిన్‌ను కూడా ఆధునికీకరిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. కొత్త రిజర్వేషన్‌ వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

రైల్వేశాఖ రూపొందించిన రైల్‌వన్‌ యాప్‌ను ఇప్పటికే 4 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రైల్వేకు సంబంధించిన అన్ని ప్రధాన సేవలు ఈ యాప్‌లోనే అందుబాటులో ఉండటంతో, కొత్త రిజర్వేషన్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సేవల అందుబాటు, వేగం మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.