రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
తృణమూల్‌లో కల్లోలం: అభిషేక్‌పై కల్యాణ్ బెనర్జీ మండిపాటు, మమతా ముందు అల్టిమేటం
తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిరంగస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ లోపల నెలకొన్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ విమర్శల రూపంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీ అధినేత్రి మమతా బనెర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ సాధారణ కార్యదర్శి అభిషేక్ బనెర్జీ వ్యవహారశైలి పట్ల కొంతమంది సీనియర్ నేతలు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తృణమూల్ లోకసభ సభ్యుడు కళ్యాణ్ బనెర్జీ , అభిషేక్ బనెర్జీ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. సంతకాల ఫోర్జరీ కేసులో తనను చివరి నిమిషంలో న్యాయవాదిగా తొలగించడం ద్వారా అవమానించారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత్రి మమతా బనెర్జీ ముందే ఆయన ఒకరకంగా అల్టిమేటం కూడా జారీ చేశారు.
సీనియర్ నేతలను గౌరవించడం అభిషేక్ బనెర్జీ కి రాదని, ఆ అహంకార ధోరణి వల్లే పార్టీ బలహీనపడుతోందని ఆయన విమర్శించారు. తనను తాను కింగ్‌లా భావించే తత్వం కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే తృణమూల్‌లో పలువురు నేతలు అభిషేక్ బనెర్జీ నిర్ణయాలపై, పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కళ్యాణ్ బనెర్జీ బహిరంగ విమర్శలు పార్టీ అంతర్గత సంక్షోభాన్ని మరింతగా బయటపెట్టినట్లయ్యాయి. మమతా బనెర్జీ నాయకత్వంపై కూడా పట్టు సడలుతోందనే చర్చలకు ఇవి బలం చేకూర్చుతున్నాయి.
ఇదిలా ఉండగా, మరో కీలక పరిణామంగా తృణమూల్ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ బారైక్ తన పదవికి రాజీనామా చేశారు. వారం రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మూడో తృణమూల్ ఎంపీగా ఆయన నిలిచారు. దీంతో ఎగువ సభలో తృణమూల్ బలం పదికి తగ్గింది. వరుస రాజీనామాలు, బహిరంగ విమర్శలు, అంతర్గత గుంపు తగాదాలు కలిసి పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాన్ని మిగులుస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు అంతర్గత అసమ్మతులు, నాయకత్వంపై అసంతృప్తి, జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మమతా బనెర్జీ ఎలా స్పందిస్తారు, అభిషేక్ బనెర్జీ పాత్రపై ఏ మార్పులు వస్తాయన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.







