రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం
మంత్రి నారాయణ సమీక్ష
ఏపీ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారులతో మంత్రి నారాయణ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అమ్యూజ్‌మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పీపీపీ విధానంలో ఏడీసీఎల్ అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే టూరిజం ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించిన మిగిలిన సంస్థలు కూడా త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ సమీక్షకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, అధికారులు హాజరయ్యారు.







