హైదరాబాద్‌ శివారు గండిపేటలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేయడానికి నకిలీ జీవోలు సృష్టించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌ అయ్యారు. కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తు ప్రకారం, హైదరాబాద్‌ శివారు గండిపేటలో 9 ఎకరాలు 28 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు బొల్లా బ్రహ్మనాయుడు తెర వెనుక నుంచి మంత్రాంగం నడిపించినట్లు తేలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నంబరు 18లో ఉన్న ఈ సర్కారు భూమికి సంబంధించి నకిలీ జీవోలు తయారు చేయడంలో, ఆ జీవో ప్రతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంకు ఖాతా నుంచి రూ.1.25 కోట్ల నగదు బదిలీ అయినట్టు గుర్తించిన పోలీసులు, దీనిని కీలక ఆధారంగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో సంబంధిత లావాదేవీలపై, నకిలీ పత్రాల తయారీ, ప్రచారం అంశాలపై పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు కుట్ర పన్నిన కేసులో బొల్లా బ్రహ్మనాయుడు సహా మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కుట్రలో పాల్గొన్న ఇతర నిందితులు బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్‌తో పాటు మరో ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు నివాసంపై సోదాలు నిర్వహించినప్పటికీ, ఆ సమయంలో ఆయన అక్కడ లేరు. అనంతరం నిందితులు మొదట హైదరాబాద్‌, ఆ తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తరలిపోయినట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించిన పోలీసులు, చివరకు శుక్రవారం తమిళనాడులోని కాంచీపురంలో బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్‌ చేశారు. ఆయనను సైబరాబాద్‌కు తరలించి, మరిన్ని వివరాల కోసం ప్రశ్నించనున్నట్లు సమాచారం. మిగతా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.