రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: విజయవాడ : తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై రాజకీయ ప్రేరేపిత చర్యలు జరుగుతున్నాయని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కేశినేని నాని ఒక పోస్టు పెట్టారు. ఆయన చేసిన ఈ పోస్టు విజయవాడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు సంవత్సరాలుగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని కేశినేని నాని పేర్కొన్నారు. అయినప్పటికీ, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని తన స్నేహితుడు తాతినేని రాంబాబుపై ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతో తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ చర్యలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నాయని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పీఎస్ఐ నవీన్, రాంబాబు ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి ఆయన తల్లిని వేధించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల ఒక అమాయక కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ విభేదాలను కుటుంబాలపై ప్రభావం చూపే విధంగా ఉపయోగించకూడదని కేశినేని నాని సూచించారు. పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. సంబంధిత ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.







