రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
నదుల అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం : సీఎం చంద్రబాబు
రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే.. రాష్ట్రానికి కరవు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఖర్చు చేసి.. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఈనెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబరు 1న వెలిగొండ ఫేజ్-1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్నారు.
కేఎల్‌రావు విజయవాడలో జన్మించడం మన అదృష్టం..
శ్రీశైలం, నాగార్జునసాగర్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కేఎల్ రావు కీలకపాత్ర పోషించారు. ఆయన విజయవాడలో జన్మించడం మన అదృష్టం. ముగ్గురు ప్రధానుల దగ్గర పనిచేసిన గొప్ప వ్యక్తి. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది.ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఖ్యాతి గడించిందటే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలే కారణం. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్మించకుంటే ఏపీ ఇబ్బంది పడేది. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణాడెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. 80 టీఎంసీలతో 13 లక్షల ఎకరాలు స్థిరీకరించాం. గోదావరి నుంచి ఏటా 2వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. ఎక్కడ నాకు పేరొస్తుందోనని.. నాడు పట్టిసీమ నిర్మిస్తుంటే అందరూ నన్ను విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు. విమర్శలు పట్టించుకొని ఉంటే పదేళ్లలో కృష్ణాడెల్టా ఏమయ్యేదో. వారి విమర్శలు పట్టించకోకుండా రూ.1300 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ పూర్తిచేశా. గోదావరి నుంచి కృష్ణానదికి 450 టీఎంసీలు తీసుకొచ్చాం. పట్టిసీమ వల్ల కరవు సీమ.. హార్టికల్చర్ హబ్‌గా తయారైంది. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏడాదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి.. కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాం. అమరావతిని నిర్మిస్తుంటే విమర్శిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపితే అమరావతి. 99శాతానికి పైగా రైతులు అమరావతికి భూములు ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్డులో ప్రయాణిస్తే.. అమరావతి విశిష్టత తెలుస్తుంది’’ అని సీఎం అన్నారు. జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.







