రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం
: మంత్రి నారా లోకేశ్
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. సోమవార దక్షిణ కొరియాలో సియోల్ బిజినెస్ ఏజెన్సీ (SBA) కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని మాట్లాడారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లోకి కొరియన్ స్టార్టప్‌లకు ఆహ్వానం పలికారు. భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు.
అమరావతి కేంద్రంగా ఆర్టీఐహెచ్.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇప్పటికే 2,500కు పైగా స్టార్టప్‌లకు ఆర్టీఐహెచ్ మద్దతు ఇచ్చిందని వివరించారు. 5,200 మందికి పైగా వ్యవస్థాపకులకు ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యం కల్పించిందని వెల్లడించారు. స్టార్టప్‌లకు సీడ్ ఫండ్, డీప్ టెక్ గ్రాంట్లు, పెట్టుబడి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. SIDBI భాగస్వామ్యంతో డీప్ టెక్ ఏంజెల్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇండియా–కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు కలిసి పనిచేద్దాం..
ఇండియా–కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు కలిసి పనిచేద్దామని మంత్రి లోకేశ్ సూచించారు. కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేక ‘కొరియా డెస్క్’ ఏర్పాటుకు ప్రతిపాదన చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్‌లకు కొరియా మార్కెట్.. కొరియా స్టార్టప్‌లకు భారత్ మార్కెట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, అడ్వాన్స్‌డ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. అమరావతిలో దేశ తొలి క్వాంటం – ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీలో 133 క్యూబిట్ IBM క్వాంటం సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌తో స్టార్టప్‌లకు భారీ కంప్యూటింగ్ సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్‌తో మంత్రి లోకేశ్ భేటీ..
అనంతరం హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్‌తో మంత్రి లోకేశ్ సమావేశం అయ్యారు. శ్రీ సిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సియోల్‌లో హ్యోసంగ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్‌మిషన్ రోడ్‌మ్యాప్‌తో ఏపీ సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేశామని తెలిపారు. 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఏపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టులకు భారీ విద్యుత్ పరికరాలు అవసరమని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, GIS, STATCOM పరికరాలకు రాష్ట్రంలో భారీ డిమాండ్ ఉందని వివరించారు. తిరుపతి లేదా శ్రీసిటీలో తయారీ/అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో 66–800 కేవీ GIS పరికరాలు తయారు చేసే ఏకైక సంస్థ హ్యోసంగ్ అని యోకోటా తకేషి తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హ్యోసంగ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.







