రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
రైల్వేతో దేశ సర్వతోముఖాభివృద్ధి
మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
దేశ సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్‌ఎస్) కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పునర్‌వ్యవస్థీకరించారు. రూ.12.56 కోట్ల భారీ వ్యయంతో ఆధునికీకరణ చేశారు. శుక్రవారం ఈ స్టేషన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘దేశ ఆర్థిక, సామాజిక ప్రగతిలో రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తోంది. దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే. గతంలో రైల్వే వ్యవస్థలో తీవ్ర ఆలస్యాలు, భద్రతా లోపాలు ఉండేవి. కానీ నేడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక సిస్టమ్స్‌తో దేశంలో అపూర్వమైన రైల్వే విప్లవం నడుస్తోంది. మంగళగిరి నియోజకవర్గానికి రైల్వే పరంగా మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ మరిన్ని రైళ్లు ఆగేలా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ చూపాలని కోరుతున్నా. మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకురావాల్సిన అవసరముంది.
ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించడానికి నేడు మంగళగిరి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూడాలని సీఎం చంద్రబాబే స్వయంగా కుప్పం నేతలకు చెప్పారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దీనికోసం రైల్వే, రోడ్డు, ఎయిర్ లైన్ రవాణా వ్యవస్థల అనుసంధానం ఎంతో అవసరం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తాం’’ అని లోకేశ్ అన్నారు.







