ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు చేయాలని వినతి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ సియోల్‌లోని ప్రముఖ పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల కేంద్రం మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోబిస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అపాక్ట్, ఎల్జీ కెమ్, శాంసంగ్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు.

శాంసంగ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ హెలెనా పార్క్‌తో నారా లోకేశ్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు చేయాలని ఆమెను కోరారు. ఇందుకు ఐఎస్‌ఎం 2.0, ప్రత్యేక సెమీకండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు అందిస్తుందని లోకేశ్‌ వివరించారు.

ఫుల్‌ ఏఐ-కంప్యూట్‌ స్టాక్‌ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ను శాంసంగ్‌ ప్రధాన కేంద్రంగా మార్చే అవకాశాలపై కూడా లోకేశ్‌ చర్చించారు. ఈ దిశగా రాష్ట్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విధానపరమైన ప్రోత్సాహకాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన సమావేశాల్లో స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

‘‘ఏపీలో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు అభివృద్ధి చేయాలి. ఏఐ-సర్వర్‌ తయారీని స్థానికీకరించి, లోకల్‌ సర్వర్‌ సర్వీసింగ్‌ హబ్‌ పెట్టాలి. విశాఖలోని క్లస్టర్‌ కేంద్రంగా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఏర్పాటు చేయాలి. మొబైల్స్‌ కోసం ఓఎస్‌ఏటీ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలి. ఏపీలో మొబైల్‌, డివైసెస్‌ బ్యాటరీ కేంద్రం ఏర్పాటు చేయాలి. శాంసంగ్‌ ఆర్‌అండ్‌డీ విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురావాలి’’ అని మంత్రి లోకేశ్‌ కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో శాంసంగ్‌ పెట్టుబడులను మరింత విస్తరించేలా ప్రత్యేక పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను కూడా లోకేశ్‌ ముందుకు పెట్టారు. ఇందుకోసం డెడికేటెడ్‌ శాంసంగ్‌ సిటీని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, రోడ్డు, విమాన సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం గురించి ఆయన కొరియా కంపెనీలకు వివరించినట్లు సమాచారం.

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా జరుగుతున్న ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌లో అధునాతన ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్‌, ఏఐ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రాన్ని గ్లోబల్‌ టెక్నాలజీ, తయారీ కేంద్రంగా నిలబెట్టే లక్ష్యంతో లోకేశ్‌ ఈ పర్యటనను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.