రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్
140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.
‘‘తెలుగుజాతి ఎవరికీ తలవంచదని అల్లూరి గర్జించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్ పోర్టు సరికొత్త అధ్యాయం. చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోంది. దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలకమని ప్రధానికి తెలుసు. అందుకే.. రైల్వే జోన్ ఇచ్చి ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్న ప్రధానికి చాలా అవమానాలు ఎదురయ్యాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో ఆలోచించాలి. దిల్లీ జంతర్‌మంతర్‌లో ప్రధానిని విమర్శిస్తుంటే చాలా బాధపడ్డా. ఎన్ని బాధలు పడ్డా.. వెనక్కి లాగుతున్నా.. మోదీ ఎక్కడా భయపడలేదు. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగలడం సహజం. తనను దూషించే వారిని కూడా క్షమించే గుణం మోదీది. సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధానికి మనం ఏం ఇవ్వగలం. దేశానికి ఇలాంటి ప్రధాని రావడం మనందరి అదృష్టం’’ అని పవన్ అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.







