జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి

ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటుచేసిన రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. రైతులు, విద్యార్థులు.. ఇలా అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమన్నారు.

‘‘పల్నాడు గడ్డపై పవిత్రమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. నిన్నటి వరకు పల్నాడు రోషానికి.. పౌరుషానికి నిదర్శనం. పల్నాడు ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు నేడు శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి. ఒకప్పుడు బ్యాంకు లోన్‌ కష్టమైన పని.. ఇప్పుడు బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్లి రుణాలిస్తున్నాయి. రైతులు, మహిళా సంఘాలు, వ్యాపారులకు రుణాలు ఇచ్చాం. ఇవాళ ఒక్క రోజే 1.04లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించడం చరిత్ర. 

గతంలో మెక్రో ఫైనాన్స్, ప్రైవేట్ కంపెనీల అప్పులతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు విలీనం చేసి సమర్థమైన బ్యాంకింగ్ వ్యవస్థ తెచ్చారు. డిజిటైజేషన్, బ్యాంక్ లింకేజ్ వంటి కార్యక్రమాలు అమలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో నిర్మలా సీతారామన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారు. మరో 6 జిల్లాల్లో ఇదేతరహాలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం అన్నారు.

ప్రతి గ్రామానికీ బ్యాంకు సేవలు ప్రధాని మోదీ లక్ష్యం: నిర్మలా సీతారామన్‌

బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రతి గ్రామానికీ బ్యాంకు సేవలు వెళ్లాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. ‘‘బ్యాంకులు తమ వైఖరిని మార్చుకున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మీ వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఇది అవకాశం. ప్రధాని చెబుతున్న వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధనకు మీ సహకారం కావాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరంతా కలిసి రావాలి. 

గతంలో చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారులతో ఇబ్బంది పడేవారు. తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రుణాలు అందించాం. బ్యాంకు రుణాలు తీసుకోవాలనే ఆలోచన గతంలో చాలా మందికి ఉండేది కాదు. మోదీ సూచనతో బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ఇవాళ లక్షల మందికి సులువుగా రుణాలు అందుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ నేతలు చెప్పిన వారికే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. తీసుకున్నవాళ్లు సరిగా చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు గ్రామగ్రామానికీ బ్యాంకులు వెళ్తున్నాయి. ప్రజల అవసరాలను తెలుసుకుని రుణాలు ఇస్తున్నారు’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు.