రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: తెలంగాణపై తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తనకు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్న వారిపై తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్‌లోకి రావొద్దని, ఇక్కడ తనకు పని ఏమిటని ప్రశ్నిస్తున్నవారిని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. తెలంగాణపై ప్రేమతోనే ఇక్కడ తిరుగుతున్నానని, తెలంగాణ యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తనకు ఎక్కువ బెదిరింపులు ఎదురయ్యాయని, తెలంగాణలో బెదిరింపుల కంటే ఆంధ్రాలోనే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావు.. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి.. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అంటే వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజలే. నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం
అధికారంపై తనకు ఆసక్తి లేదని, మార్పుపైనే తన ప్రేమ ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని తమ నేతలు పలుమార్లు కోరినా, ఆంధ్రప్రదేశ్‌లోనే అధికారాన్ని ఆశించని తాను తెలంగాణలో అధికారాన్ని ఎందుకు కోరుకుంటానని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదని, నిజంగా ద్వేషం పెంచుకుని ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని మా నేతలు చాలా సార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతాను. నాకు అధికారంపై ప్రేమకాదు.. మార్పుపైనే ప్రేమ. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదు. తెలంగాణ నలుమూలల నుంచి తిరిగిన వ్యక్తిని.. ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్లు ఆదిలాబాద్ అడవుల్లో తిరగలేదు.. నేను తిరిగాను
తాను తెలంగాణకు వ్యతిరేకి కాదని, రాష్ట్ర విభజన జరిగిన తీరు పట్ల మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం తాను మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. పార్లమెంటు తలుపులు మూసి విభజన చేయడం తప్పు అని అప్పట్లోనే చెప్పానని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకి అని కొందరు ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఒక విశ్లేషకుడి వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని ఆయన పేర్కొన్నారు.
నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు.. విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకిని. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చాను. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పా. తెలంగాణ వ్యతిరేకం అని వైఎస్ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారు. నేను ఇప్పటివరకూ ఒక్క తెలంగాణ నాయకుడిపైనా విమర్శలు చేయలేదు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల ఇది మొదలైంది. ఆ తర్వాత ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టి మరీ తిట్టారు. తెలుగు ప్రజలు 50ఏళ్లు కలిసి ఉన్న రాజధాని హైదరాబాద్. పాలకులు వేరు.. ప్రజలు వేరు. పాలకులను తిట్టండి. నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డికి చెబుతున్నా. ఒకవేళ నేను కబ్జా చేశానని నిరూపణ అయితే, స్వాధీనం చేసుకోండి. తెలంగాణలో నేనే తిరుగుతా. ఇన్నాళ్లూ భరించాం. ఇకపై జనసేన పోటీ చేస్తుంది. ఏం చేస్తారో చేసుకోండి.
హైదరాబాద్‌లో చెరువు ఆక్రమణ ఆరోపణలపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, సంబంధిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఇకపై తెలంగాణలో జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.







