రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ కూడలిలో దీక్షకు వైకాపా పిలుపునివ్వగా.. తెదేపా నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ కేతిరెడ్డి.. తన అనుచరులతో కలిసి భగత్‌సింగ్ నగర్‌లోని నివాసం ఎదుట బైఠాయించారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో పెద్దారెడ్డి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి.. భగత్‌సింగ్ నగర్‌లోని కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.







