వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ నీతి, పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో NTR కు వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని, పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న వ్యక్తి ఈరోజు NTR విగ్రహాలకు పూలదండలు వేసి రాజకీయ నీతి గురించి ప్రసంగించడం అత్యంత సిగ్గుచేటు చర్యగా పేర్ని నాని అభివర్ణించారు.

చంద్రబాబు నాయుడు కు అసలు క్యారెక్టర్, కనీస రాజకీయ సంస్కారం ఉన్నాయా అనే ప్రశ్నను పేర్ని నాని లేవనెత్తారు. ఇటువంటి వ్యక్తి అనుభవం రాష్ట్రానికి అవసరమని చెప్పడం తగదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాను నియంత్రించేందుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నదని పేర్ని నాని ఆరోపించారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో రూ.210 కోట్లు ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారి గొంతు నులిమేందుకు టాస్క్ ఫోర్స్ , Sub కంమిట్టీస్ పేరుతో YSRCP కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, పాపాలు ప్రజలకు కనపడకూడదనే ఉద్దేశంతోనే ఈ అణచివేత చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

గతంలో అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు దేనని పేర్ని నాని గుర్తుచేశారు. రాజధానికి అవసరం లేకపోయినా పెనుమాక , ఉండవల్లి గ్రామాల రైతులపై దుర్మార్గం కొనసాగుతున్నదని, ఉండవల్లి లో జనసేన కు చెందిన రైతుల పొలాలను కూడా ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. అమరావతి రైతుల కన్నీటి గాథలను, విజయవాడ లాక్ అప్ డెత్ దారుణాన్ని సోషల్ మీడియానే సమాజానికి చూపించిందని, అందుకే ప్రశ్నించే వారిపై కక్షగట్టే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని వ్యాఖ్యానించారు.

అక్రమ కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలను ఒక నెల రోజులు జైల్లో ఉంచగలిగినా, కొత్త చట్టాలు తెచ్చినా తాము భయపడే ప్రసక్తే లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో ప్రస్తుత కేబినెట్ ఒక్కటైనా ప్రజాహిత నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్నను ఆయన ముందుకు తెచ్చారు. మంగళగిరి ప్రజలు ఓటు వేసి గెలిపించినప్పటికీ లోకేష్ వారికి అందుబాటులో లేరని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో పే స్లిప్ లతో సహా చూపించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని పేర్ని నాని సవాల్ విసిరారు. మరోవైపు RTC ను అమ్మకానికి పెట్టేందుకు తలుపులు తెరవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ను నమ్మి చట్టవ్యతిరేకంగా పనిచేస్తే CI నాగరాజు కు పట్టిన గతే పడుతుందనే భయం ఇప్పుడు పోలీసు వ్యవస్థలో నెలకొన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని, ఆయనకు ఏమైనా మానసిక రుగ్మత ఉందో లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చర్చల్లోకి వచ్చిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్ వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. రావణ్ అనే వ్యక్తి ఐడియాలజీకి తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

గతంలో రావణ్ అనే వ్యక్తితో YS జగన్ మోహన్ రెడ్డి ను దారుణంగా తిట్టించారని పేర్ని నాని గుర్తుచేశారు. ఆ రావణ్ అనే వ్యక్తి కేవలం YS జగన్ మోహన్ రెడ్డి , పవన్ కళ్యాణ్ను మాత్రమే ఎందుకు విమర్శిస్తాడో, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ల గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడో ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. తాడేపల్లి పాలస్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, చంద్రబాబునాయుడు తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.