రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
మేము కూడా బాధితులమే..
: ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
తాను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తానని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన క్రిమినల్ కేసుపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మధ్యవర్తులను నమ్మి కొన్నాం
భూమి కొనుగోలులో తాను ఎలాంటి అక్రమ మార్గాలను అనుసరించలేదని తమ్మినేని చెప్పారు. 'డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను నమ్మి, వాటి ఆధారంగానే మేము ఆ భూమిని కొనుగోలు చేశాం' అని ఆయన వివరించారు. ఒక సామాన్యుడిలాగే తాము కూడా పత్రాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియను చేపట్టామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యంతరాలు లేవు
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని పత్రాలను సమర్పించామని, అధికారులు వాటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తమ్మినేని అన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఎవరూ కూడా ఆ భూమిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తపరచలేదని ఆయన స్పష్టం చేశారు.







