అమరావతి: హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మహిళల దుస్తులు, అలంకరణలపై వ్యాఖ్యలు చేసే స్థాయికి వైకాపా నేతలు దిగజారిపోయారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు కేవలం వంగలపూడి అనితను లక్ష్యంగా చేసుకున్నట్టే కాకుండా, సగటు మహిళలందరినీ కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళల గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరమని, ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు మరచిపోవద్దని సూచించారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అయితే అవి విధానపరమైన అంశాలకే పరిమితమై ఉండాలని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఏదైనా ప్రభుత్వ విధానం నచ్చకపోతే, ఆ విధానంపైనే విమర్శలు చేయాలని, వ్యక్తిగత స్థాయిలో, ముఖ్యంగా ఇళ్లలోని మహిళలను కించపరిచే రీతిలో మాట్లాడటం అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు.

ఇళ్లలోని స్త్రీలను అవమానించే స్వభావం ఉన్న పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలను కూటమి నేతలంతా బలంగా తిప్పికొట్టాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

పౌర సమాజం ఆమోదించే, హర్షించే భాషలోనే కూటమి నాయకులు బలంగా బదులివ్వాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అవతలి పార్టీ నేతలు ఉపయోగించే దిగజారుడు భాష, అర్థరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.