వెలిగొండ ప్రాజెక్టు రైతులకు భరోసా: ఒక్కరోజులోనే రూ.300 కోట్లు ఆర్ అండ్ ఆర్ నిధుల విడుదల

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం భావోద్వేగభరిత వాతావరణంలో సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలకు చెందిన రైతులు, నిర్వాసితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతుల మధ్యనే కూర్చొని ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి, వారి సమస్యలు, అభ్యర్థనలు వివరంగా విన్నారు.

ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంతోపాటు, పునరావాసం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని నిర్వాసితులు సమావేశంలో తెలిపారు. పునరావాసం ప్రక్రియలో గత ప్రభుత్వ కాలంలో ఎదుర్కొన్న వేధింపులను రైతులు, నిర్వాసితులు వివరంగా చెప్పుకున్నారు.

పునరావాసం అందించేందుకు రూ.300 కోట్లు ఇవ్వడానికి స్వయంగా ముఖ్యమంత్రి రావడం తమకు ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని సుంకేశుల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వలీ అనే నిర్వాసితుడు పేర్కొన్నారు. తమ బాధలను, తమను గుర్తించి పరిష్కారం చూపింది చంద్రబాబేనని చెబుతూ ఖాసీం వలీ కళ్లనీళ్లు పెట్టుకున్నట్లు అక్కడున్న వారు తెలిపారు.

గత పాలకులు పునరావాసం ఇవ్వమంటే అరెస్టులు చేసి వేధించారని, ఆ కాలంలో జరిగిన సంఘటనలను నిర్వాసితులు సమావేశంలో గుర్తు చేసుకున్నారు. తమ హక్కులను కాలరాసే విధంగా తమను బంధించారని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పునరావాసం డబ్బులు అందుతుండడంతో తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై ఇప్పుడు భరోసా కలిగిందని మరో నిర్వాసితుడు హనుమ ప్రసాద్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను చకచకా చేపట్టడం ద్వారా తమ 30 ఏళ్ల కలను సాకారం చేస్తున్నారని భావించిన కొందరు రైతులు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అలా చేయవద్దని ఆపినట్లు సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు.

రైతులు, నిర్వాసితులు మాట్లాడిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడడం తన బాధ్యత అని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. నాలుగు జిల్లాల తలరాతలు మార్చే వెలిగొండ ప్రాజెక్టు కోసం నిర్వాసితులు చేస్తున్న త్యాగానికి తగ్గ ఫలితాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 7,225 మంది నిర్వాసితులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం వారిలో కేవలం 96 మందికే ఆర్ అండ్ ఆర్ నిధులు అందించినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. అయితే శనివారం ఒక్క రోజులోనే 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్ల మేర ఆర్ అండ్ ఆర్ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఈ చర్యతో పునరావాసం ప్రక్రియకు వేగం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.