ఇంట్లో ఇతర కూరగాయలు లేకపోయినా టొమాటోలు ఉంటే చాలనిపించేంతగా మన వంటింట్లో టమోటోకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా టమోటో పప్పు, కూర, చారు, రసం లాంటి వంటకాలకే పరిమితమైపోతాం. అయితే కొంచెం వెరైటీగా ప్రయత్నిస్తే నోటికి కొత్త రుచి, భోజనానికి కొత్తదనం వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ టొమాటో పూర్ణం, ఆంధ్ర స్టైల్ టొమాటో కూర, కన్నడ వంటకం టొమాటో గొజ్జు తయారీ విధానాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణ టొమాటో పూర్ణం

టొమాటో పూర్ణం తయారీకి టొమాటోలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, చింతపండు, కారం, బెల్లం, కరివేపాకులు, మెంతులు, ఎండుమిర్చి, నూనె, పచ్చిమిర్చి, గరంమసాలా, అల్లం పేస్ట్ అవసరం.

మొదట పాన్‌లో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేగించి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. అదే పాన్‌లో నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేగించాలి. తరువాత ఉల్లి తరుగు వేసి దోరగా అయ్యే వరకు వేగించాలి. పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగించిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి.

ఇందులో ముందుగా గ్రైండ్ చేసిన పల్లీల మిశ్రమం వేసి ఉడికించాలి. తరువాత ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు వేసి సన్నని మంటపై ఉడికించాలి. చింతపండు రసం పోసి, మూత పెట్టి నూనె పైకి వచ్చే వరకు మగ్గించాలి. టొమాటోలను నాలుగు వైపులా కోసి, అడుగు వరకు కోయకుండా జాగ్రత్తగా కట్ చేసి ఈ గ్రేవీలో వేసి ఉడికించాలి. చివర్లో కొద్దిగా బెల్లం, గరంమసాలా చల్లి దింపితే రుచికరమైన టొమాటో పూర్ణం సిద్ధమవుతుంది.

ఆంధ్ర స్టైల్ టొమాటో కూర

ఈ కూరకు టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు, నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు, కొబ్బరి పాలు, పల్లీ గింజలు లేదా నువ్వుల పొడి అవసరం.

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి తాలింపు చేయాలి. తరువాత ఉల్లి తరుగు, ఉప్పు వేసి ఉల్లి రంగు మారే వరకు వేగించాలి. టొమాటో తరుగు, పసుపు వేసి మూత పెట్టి టొమాటో మెత్తబడే వరకు ఉడికించాలి. తరువాత కారం, నువ్వుల పొడి లేదా పల్లీ పొడి వేసి కూర చిక్కగా అయ్యే వరకు మగ్గించాలి. చివరగా కొబ్బరి పాలు పోసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఈ కూరను వేడి అన్నంలో నెయ్యితో కలిపి లేదా చపాతీతో తింటే బాగా రుచిస్తుంది.

కన్నడ టొమాటో గొజ్జు

టొమాటో గొజ్జు కోసం టొమాటో తరుగు, ఉల్లిపాయ తరుగు, నూనె, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బెల్లం తురుము, నీళ్లు, కొత్తిమీర తరుగు, గసగసాలు, తాజా కొబ్బరి తురుము, పుట్నాలపప్పు అవసరం.

మొదట గసగసాలను నీళ్లలో నానబెట్టి, తరువాత వాటితో పాటు కొబ్బరి తురుము, పుట్నాలపప్పు కలిపి మెత్తటి పేస్ట్ పట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమంటున్నప్పుడు మినప్పప్పు, ఇంగువ, పసుపు వేసి వేగించాలి. మినప్పప్పు లేత బంగారు రంగు వచ్చాక పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేపాలి. తరువాత ఉల్లి తరుగు, అల్లం పేస్ట్ వేసి ఉల్లి రంగు మారే వరకు వేగించి టొమాటో తరుగు వేసి మూత పెట్టి ఉడికించాలి.

టొమాటో మెత్తబడిన తర్వాత బెల్లం తురుము, ఉప్పు, గసగసాల–కొబ్బరి పేస్ట్ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి మగ్గించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. కన్నడ వంటకం అయిన ఈ టొమాటో గొజ్జును చపాతీ, పూరీ, దోశతో పాటు పిజ్జా, శాండ్‌విచ్‌లపై టాపింగ్‌గా కూడా వాడొచ్చు. ఫ్రిజ్‌లో ఉంచితే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది.