రాయలసీమ న్యూస్, ఆహా డెస్క్: మటన్ వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వంటకం నల్లీ మసాలా. ఎముకలతో కూడిన మటన్‌ను నెమ్మదిగా ఉడికించి, ఎముకల్లోని గుజ్జు గ్రేవీలో కలిసేలా చేయడం ఈ వంటకం ప్రత్యేకత. హోటల్‌లో లభించే రుచిని ఇంట్లోనే ఆస్వాదించాలని కోరుకునే వారికి నల్లీ మసాలా మంచి ఎంపికగా నిలుస్తోంది.
ఈ వంటకం సిద్ధం చేసేందుకు ముందుగా ఎముకలతో కూడిన మటన్ ఒక కిలోను బాగా కడిగి పక్కన పెట్టాలి. పెరుగు ముప్పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో సగం, పసుపు అర స్పూన్, కొద్దిగా ఉప్పు కలిపి మటన్ ముక్కలకు పట్టించి సుమారు అరగంటపాటు నాననివ్వాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మటన్ మృదువుగా, రుచిగా ఉడుకుతుంది.
తర్వాత కుక్కర్‌లో నూనె ఒక కప్పు వేడిచేసి బిర్యానీ ఆకులు రెండు, దాల్చినచెక్క రెండంగుళాల ముక్క, యాలకులు నాలుగు, లవంగాలు ఆరు, షాజీరా ఒక స్పూన్ వేసి వేగించాలి. ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 300 గ్రాములు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి ఆరు, టొమాటో ముక్కలు పావుకిలో జోడించాలి.
ఇవి కొద్దిసేపు వేపిన తర్వాత కారం, ధనియాల పొడి చెరో రెండు స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి చెరో స్పూన్ వేసి బాగా కలపాలి. తరువాత మ్యారినేట్ చేసిన మటన్‌ను జోడించి సన్నని సెగపై కలియతిప్పుతూ పది నిమిషాలపాటు వేపాలి. ఈ దశలో మసాలాలు మటన్‌లో బాగా కలిసేలా చూసుకోవడం అవసరం.
తర్వాత తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కలిపి కుక్కర్‌కు మూత పెట్టాలి. మధ్యస్థమైన సెగపై ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి గరం మసాలా పొడి, పుదీనా పావుకప్పు, కొత్తిమీర తరుగు సగం అర కప్పు జోడించి కలపాలి. మూత లేకుండా సిమ్ సెగపై మరో పది నిమిషాలు ఉడికించాలి. చివరగా మిగిలిన కొత్తిమీర చల్లి స్టౌపై నుంచి దించాలి.
ఇలా సిద్ధమైన నల్లీ మసాలా బగారా రైస్, చపాతీ, రుమాలీ రోటీలతో ఎంతో రుచిగా ఉంటుంది. ఎముకల్లోని గుజ్జు గ్రేవీలో కలవడం వల్ల వంటకానికి రిచ్ టేస్ట్ వస్తుందని వంట నిపుణులు సూచిస్తున్నారు. నాన్‌వెజ్ ప్రియులు ఇంట్లోనే హోటల్ రుచిని ఆస్వాదించాలనుకుంటే ఈ విధానాన్ని అనుసరించి నల్లీ మసాలా ప్రయత్నించవచ్చు.






