రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఆయన కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో, శిక్ష ఖరారు అంశంపై ఇప్పుడు క్రీడా వర్గాల్లో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో శిక్షను నిర్ణయించేందుకు కోర్టు ఆగస్టు 18 తేదీని నిర్దేశించింది.
ఈ పరిణామం డేవిడ్ వార్నర్ వ్యక్తిగత జీవితం, ఆయన క్రికెట్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కొనసాగుతారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి బుధవారం Waverley లోకల్ కోర్ట్ లో విచారణ జరిగింది. డేవిడ్ వార్నర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది బాబీ హిల్ , మధ్యస్థాయి మద్యం సేవించి వాహనం నడిపిన ఆరోపణను డేవిడ్ వార్నర్ అంగీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన కొన్ని వాస్తవాలపై ఇరు పక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ఘటన ఏప్రిల్ 5న చోటుచేసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి విరామం తీసుకుని ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన డేవిడ్ వార్నర్ ను Sydney తూర్పు ప్రాంతంలో పోలీసులు తనిఖీ కోసం ఆపారు. రోడ్డు పక్కనే నిర్వహించిన ప్రాథమిక తనిఖీ అనంతరం ఆయనను మరౌబ్రా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి breathalyser పరీక్ష నిర్వహించారు.
ఆ పరీక్షలో డేవిడ్ వార్నర్ రక్తంలోని ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధంగా అనుమతించిన పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు.
వార్నర్ తరఫు న్యాయవాది బాబీ హిల్ వివరాల ప్రకారం, ఘటనకు ముందు వార్నర్ ఓ స్నేహితుడి అపార్ట్మెంట్ లో మూడు గ్లాసుల వైన్ తాగారు. చివరిసారిగా మద్యం సేవించిన కేవలం 11 నిమిషాలకే పోలీసులు ఆయనను ఆపారని తెలిపారు. టాక్సీ లేదా ఉబెర్ ను ఉపయోగించాల్సిందని తెలిసినా, తానే వాహనం నడపడం డేవిడ్ వార్నర్ చేసిన పెద్ద తప్పు అని హిల్ పేర్కొన్నారు.
వార్నర్ తన నిర్ణయం తప్పని పూర్తిగా గ్రహించారని, తన చర్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని హిల్ కోర్టుకు వివరించారు. సాధారణ పౌరుడిలాగే కోర్టు విధించే శిక్షను స్వీకరించేందుకు వార్నర్ సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన తెలిపారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సిడ్నీ థండర్ కెప్టెన్సీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు జట్టు యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు క్రికెట్ NSW చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ గెర్మోన్ , ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడాన్ని క్రికెట్ NSW ఎప్పటికీ సమర్థించదని, సురక్షితమైన డ్రైవింగ్‌కు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. సిడ్నీ థండర్ , సిడ్నీ సిక్సర్లు , NSW బ్లూస్ జట్లు రాష్ట్ర ప్రభుత్వ “ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ” అవగాహన కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి. అలాంటి ప్రచారానికి అనుబంధంగా ఉన్న జట్టు కెప్టెన్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.
గతంలో 2018లో జరిగిన సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా డేవిడ్ వార్నర్ జీవితకాల నాయకత్వ నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ఆ నిషేధాన్ని 2024లో ఎత్తివేయడంతో, అనంతరం ఆయన సిడ్నీ థండర్ కు కెప్టెన్‌గా నియమితులయ్యారు.
తాజా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నేపథ్యంలో వార్నర్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఆగస్టు 18న కోర్టు విధించే శిక్షతో పాటు, క్రికెట్ NSW మరియు సిడ్నీ థండర్ యాజమాన్యాల నిర్ణయాలు కూడా వార్నర్ కెరీర్‌పై కీలక ప్రభావం చూపే అవకాశముంది.







