రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా విజయవంతమైన ఆరంభం చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసి బలమైన సంకేతాలు పంపించింది. ఈ విజయంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రదర్శన కీలకంగా నిలిచింది. కేవలం 10 పరుగులకే 5 వికెట్లు తీయడం ద్వారా ఆమె పాక్ బ్యాటింగ్‌ను గడగడలాడించింది.
ఈ ఫైఫర్‌తో దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె రికార్డు బుక్‌లో పేరు నమోదు చేసుకుంది. ప్రస్తుతం దీప్తి ఖాతాలో 166 వికెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌కు చెందిన బౌలర్ తైపాట్చా పుత్తవాంగ్ (165 వికెట్లు)ను ఆమె అధిగమించింది.
ప్రపంచ కప్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో బౌలర్‌గా కూడా దీప్తి శర్మ ప్రత్యేక గుర్తింపు పొందింది. కీలక టోర్నీల్లో, ముఖ్యంగా ప్రపంచ కప్‌ల్లో, తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, ఈ మ్యాచ్‌లోనూ అదే ధోరణిని కొనసాగించింది.
మ్యాచ్ అనంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆడడం, పెద్ద వేదికలపై తన ప్రతిభను చాటుకోవడం పట్ల దీప్తి ఆనందం వ్యక్తం చేసింది.
నాకు ఒత్తిడితో కూడుకొన్న పరిస్థితులు అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఐసీసీ టోర్నీలను ఆస్వాదిస్తా. గతంలో నేను ఎక్కడ ముగించానో.. ఇప్పుడు అక్కడినుంచే ప్రారంభించానని అనుకుంటున్నా. నేను ప్రాక్టీస్ సమయంలో ఏం చేస్తానో ఇప్పుడు మైదానంలోనూ అదే అమలుచేశా. పిచ్ పరిస్థితులు కూడా ఇందుకు సహకరించాయి. నన్ను నేను మెరుగుపర్చుకొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటా. యంగ్‌గా ఉన్న అప్పటికి.. సీనియారిటీ వచ్చిన ఇప్పటికి స్పష్టమైన తేడా చూపించాలి. తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటున్నా. నిరంతరం అవిష్కర్ సార్‌తో మాట్లాడుతూనే ఉంటా. బౌలింగ్ వీడియోలు చూస్తూ పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌లో స్మృతి, హర్మన్ మంచి పునాది వేశారు. అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. అదే మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది జట్టు విజయం. ఆ దేవుడి దయ వల్ల మాకు అందరి సహకారం లభించింది
కాగా, హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఇది 10వ టీ20 ప్రపంచ కప్ టోర్నీ కావడం విశేషం. దీప్తి శర్మ బౌలింగ్ రికార్డు, హర్మన్ బ్యాటింగ్ ఘనత, జట్టు సమిష్టి ప్రదర్శన కలిసి భారత్‌కు టోర్నీ ఆరంభంలోనే ఉత్సాహభరిత విజయాన్ని అందించాయి.







